క్రిప్టో కరెన్సీ పేరుతో పుదుచ్చేరిలో జరిగిన రూ. 2.4 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సినీ హీరోయిన్లు తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌ను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ పెట్టి 10 మంది నుంచి రూ.2.4 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుదుచ్చేరిలోని మూలకుళం ప్రాంతానికి చెందిన మాజీ సైనికాధికారి అయిన అశోకన్ (66) పదవీ విరమణ తర్వాత బీఎస్ఎన్ఎల్‌లో పనిచేశారు. ఇంటర్నెట్‌లో ఒక ప్రకటన చూసి నమ్మిన ఆయన ఒక రహస్య వ్యక్తిని కలిసిన అనంతరం పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని, పొదుపు చేసుకున్న సొమ్ము మొత్తం రూ. 10 లక్షలను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారు.
ఈ క్రమంలో 2022లో కోయంబత్తూరులో జరిగిన కంపెనీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అశోకన్‌కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి తమన్నాతోపాటు మరికొందరు తారలు హాజరుకావడంతో అశోకన్ తన పెట్టుబడిని క్రమంగా కోటి రూపాయలకు పెంచారు. అంతేకాకుండా పుదుచ్చేరికి చెందిన తన స్నేహితులు మరో 10 మందితో రూ. 2.4 కోట్లు పెట్టుబడి పెట్టించారు.
అనంతరం కొన్ని నెలల తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి కూడా అశోకన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 100 మందికి రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన కార్లను బహుమతులుగా అందించారు. అయితే, అశోకన్ తనకు ఇచ్చిన కారుకు బదులుగా రూ. 8 లక్షల నగదు తీసుకున్నారు.
అయితే, ఆ తర్వాత కంపెనీ తమను మోసం చేసిందంటూ అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భారీ మోసం కేసులో పోలీసులు ఇప్పటికే నితీశ్ జైన్ (36), అరవింద్ కుమార్ (40)లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమన్నా, కాజల్‌ను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు