నర్సాపూర్ (ప్రజాజ్యోతి) అధికారులు విధుల్లో లేని సమయం చూసి అక్రమార్కులు పంజా విసురుతున్నారు. వరుస సెలవులను ఆసరాగా చేసుకుని నర్సాపూర్ మండలం ఇసుక మాఫియా యధేచ్ఛగా చెలరేగిపోతోంది. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణకు రారనే ధీమాతో భారీ యంత్రాలను రంగంలోకి దించారు. పొలాల్లో మట్టిని తవ్వి, దానిని కృత్రిమ ఇసుకగా మార్చి అక్రమంగా తరలిస్తూ కాసుల వేట సాగిస్తున్నారు. వ్యవసాయం చేసుకోవాల్సిన పొలాల్లో జెసిబిలతో భారీ గోతులు తవ్వుతుండటంతో పక్కనే ఉన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల కళ్లుగప్పి సాగిస్తున్న ఈ తవ్వకాల వల్ల భూగర్భ జల మట్టం పడిపోయి, సాగునీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సెలవు రోజులను అక్రమార్కులు తమకు సానుకూలంగా మార్చుకుని, భారీగా ఇసుకను నిల్వ చేసి తరలిస్తున్నారు.
• శాఖల సమన్వయం లేకే..
సాధారణంగా సెలవు దినాల్లో నిఘా తక్కువగా ఉంటుందని తెలిసిన మాఫియా, ఇదే అదనుగా జాతరను తలపిస్తూ తవ్వకాలు జరుపుతోంది. క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా లేకపోవడమే వీరికి వరంగా మారింది. అధికారుల కళ్లుగప్పి పగలు, రాత్రి తేడా లేకుండా యంత్రాలు రొద చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సెలవు ముసుగులో సాగుతున్న ఈ ఇసుక దందాను అరికట్టాలని గ్రామస్థులు, ప్రజలు కోరుతున్నారు.
