గరిడేపల్లి,ఫిబ్రవరి 17(ప్రజా జ్యోతి):గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్న పంటలలో కుంకుడుకాయ (సోప్నట్) ఒకటి అని డైరెక్టర్ అటారీ జోన్ షేక్ ఎన్. మీరా అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కుంకుడుకాయ (సోప్ నట్) పంట సాగు,విలువ ఆధారిత ఉత్పత్తుల పై అవగాహన కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హజర య్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (కుంకుడుకాయ) పంట తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం అందించే లాభదాయకమైన బహుళ ఉపయోగాల పంటగా తెలిపారు. పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా వినియోగించే ఈ పంట సూర్యాపేట జిల్లా వాతావరణానికి అనుకూలమని పేర్కొన్నారు. అలాగే నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు మరియు ఫర్టిలైజర్ బ్రాడ్కాస్టర్ వినియోగంపై ప్రదర్శన ఇచ్చారు.అలాగే కృత్రిమ మేధా ఆధారిత వ్యవసాయ సూచనలు రైతులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో సాగు చేయగలగడం,మార్కెట్లో ఎప్పటి కప్పుడు డిమాండ్ ఉండటం వల్ల ఈ పంట రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తోందన్నారు. రైతు లోకసాని పద్మావతి రెడ్డి (దేవరకొండ) గత 15 ఏళ్లుగా సాగు చేస్తున్న అనుభవాలను పంచుకుని,కుంకుడుకాయతో షాంపూ,లిక్విడ్ డిటర్జెంట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అధిక లాభాలు పొందవచ్చని వివరించారు.ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండి,గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఐఆర్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా.సాయి ప్రసాద్, సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,సూర్యాపేట జిల్లా ఉద్యాన మరియు పట్టు విభాగ అధికారి టి.నాగయ్య, అరబిందో గ్రామీణ అభివృద్ధి సంస్థ బోర్డు అఫ్ డైరెక్టర్ గంటా లక్ష్మి,గంటా అమరేందర్ రెడ్డి,లోకసాని పద్మా రెడ్డి, కుంకుడుకాయ ఆదర్శ రైతు,కెవికె శాస్త్రవేత్తలు,వేర్ ఇస్ కంపెనీ మేనేజర్,సూర్యాపేట మరియు నల్గొండ జిల్లా రైతులు పాల్గొన్నారు.
