హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ పాఠాలు చెబుతున్న హైడ్రా

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన కల్పించేందుకు నగరం నలుమూలలా భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

ఇటీవల నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షోరూంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో పాటు, నగరంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ఈ చర్యలకు ప్రధాన కారణంగా నిలిచాయి. చాలా వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని అధికారులు జరిపిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, అగ్నిమాపక భద్రతా నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేందుకు వాణిజ్య సంస్థలకు నెల రోజుల గడువు ఇస్తూనే, మరోవైపు ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ప్రమాదం సంభవిస్తే మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలనే అంశాలపై వివరిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగం, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు, పొగను గుర్తించే స్మోక్ డిటెక్టర్ల పనితీరుపై ప్రాక్టికల్‌గా చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. షాపులు, కార్యాలయాల్లో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడం, వాటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నారు.

పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి-మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, సనత్‌నగర్‌, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అల్వాల్‌, బంజారాహిల్స్, శంషాబాద్‌, కొంపల్లి, నాంపల్లి వంటి 30కి పైగా ప్రధాన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించి, ప్రమాద సమయంలో సురక్షితంగా ఎలా బయటపడాలో కార్మికులకు, వ్యాపారులకు సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన 101 నంబర్‌తో పాటు, హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 1070 లేదా మొబైల్ నంబర్ 9000113667కు ఫోన్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *