హైదరాబాద్:
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE)
– నుమాయిష్‌లో భాగంగా యువ గాయకుల ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ‘నుమాయిష్ సుర్-స్టార్ – 2026’ పేరుతో ఘనమైన గాన పోటీని నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ, హైదరాబాద్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పోటీ వివరాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రముఖ గాన పోటీల తరహాలో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్, తెలంగాణకు చెందిన యువ గాయకులకు ప్రత్యక్ష ప్రేక్షకులు, ప్రముఖ జడ్జీల ముందు తమ ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని ఈ పోటీ కల్పించనుందని చెప్పారు.
16 నుంచి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు సంబంధించిన వివిధ గాన శైలుల్లో ప్రతిభ కనబర్చే అవకాశం ఉందన్నారు.
ఆడిషన్లు, నాకౌట్ రౌండ్లు, గ్రాండ్ ఫినాలే షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు నడుస్తున్న AIIE నుమాయిష్ వేడుకల సమయంలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు మీడియా ప్రతినిధులు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి కొత్త గాన ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు
