అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబుల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి సారించడంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలా మంది యూఎస్ లో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వులో పేర్కొన్నారు. అవసరమైన సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను అనుమతించవని స్పష్టం చేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు.