రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్ఠను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీకి జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధించిందని బీఆర్‌ఎస్ నేత ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి వేదికలపై ఎదుర్కొన్న అనుభవాలను చెప్పేందుకు ఎంతో ధైర్యం కావాలన్నారు. మిల్లా ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు.
“మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అవసరం. మిల్లా మ్యాగీ చాలా బలమైన మహిళ. తెలంగాణలో మీరు ఇలాంటి అవమానపూరిత పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. మేము వారిని గౌరవిస్తాము, వృద్ధికి సమాన అవకాశాలను అందిస్తాము.
మా భూమి నుంచి వచ్చిన గొప్ప నాయకులలో రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి కొందరు మహిళలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటి భయంకరమైన అనుభవాలను ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాను” అని కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ తమను వేశ్య లాగా చూశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. మరోవైపు మ్యాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ పోటీల నిర్వహకులు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, ఆమెనే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయినట్లు వివరించారు.