దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడటం గమనార్హం.
అయితే దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, ఆ ప్రభావం కొంతమేర భారత్‌పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.
కేసుల వారీగా పరిశీలిస్తే, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి కోవిడ్ మరణాలు కావని వైద్యులు ధృవీకరించారు.
మరణించిన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ వారు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ కారణాలతోనే మరణించారని వైద్యులు వివరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.