కూకట్ పల్లి పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. హైకోర్టు ఆదేశించినా ఆక్రమణలను తొలగించకపోవడంతో సోమవారం రంగంలోకి దిగిన హైడ్రా.. లేఅవుట్ లోని షెడ్లను బుల్డోజర్లతో తొలగించింది. ఈ లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులకు న్యాయం చేసింది. దీంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ కు, అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ థ్యాంక్స్ చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేస్తూ బాధితులు కృతజ్ఞతలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాధితుల వివరాల ప్రకారం.. హైదర్‌నగర్ డివిజన్‌లోని సర్వే నెంబర్ 145లో 9 ఎకరాల 27 గుంటల స్థలంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ విస్తరించింది. 2000 సంవత్సరంలో ఈ లేఅవుట్ లో 79 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదని శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి ఆక్రమించాడు. హైకోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా స్టే తెచ్చుకున్నాడు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని వెంచర్ లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో న్యాయం కోసం 79 మంది బాధితులు కోర్టుకెక్కారు. గతేడాది సెప్టెంబర్ లో బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. శివ దుర్గాప్రసాద్, ఆయన అనుచరులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. అయినా శివ దుర్గాప్రసాద్ ఖాళీ చేయకపోవడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు సోమవారం రంగంలోకి దిగి ఆక్రమణలను కూల్చివేశారు