తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA), ఫిల్మ్ జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ దిశగా మరో ముందడుగు వేసింది. ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సహకారంతో శనివారం (ఏప్రిల్ 26) హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరం ద్వారా పలువురు ఫిల్మ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రియదర్శి, నిర్మాత నాగవంశీ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఐ క్యాంప్‌కు శ్రీకారం చుట్టారు. అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాశ్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్, TFJA అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు రఘు, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు తదితరులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి కూడా శిబిరంలో తన కంటి చూపును పరీక్ష చేయించుకున్నారు. ఆయన కంటి చూపు పనితీరు బాగుందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ, “తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఫిల్మ్ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న TFJA ప్రతినిధులను, ఈ కార్యక్రమానికి సహకరించిన ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాశ్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ విశ్వమోహన్ గారికి నా అభినందనలు” అని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శంకర్ ఐ హాస్పిటల్ వైద్య బృందం… TFJA సభ్యులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, తగిన సూచనలు అందించింది.