సిద్దిపేట అర్బన్, ఆగస్టు 22 (ప్రజాజ్యోతి):రాజ్ బహదూర్ వెంకట్రామ రెడ్డి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్ బహదూర్ వెంకట్రామ రెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి వెంకట్రామ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒక్కరు మాత్రమే ఎదగడం గొప్పతనం కాదని, తమతో పాటు మరో పది మందిని పైకి తీసుకురావడమే నిజమైన గొప్పతనమన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం రాజ్ బహదూర్ వెంకట్రామ రెడ్డి చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఏర్పాటు చేసిన హాస్టల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.రెడ్డి ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వినియోగించాలని నూతన కమిటీకి హరీశ్ రావు సూచించారు. నిధుల్లో 50 శాతం రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు, మిగతా 50 శాతం ఇతర వర్గాల నిరుపేద విద్యార్థులకు కేటాయించాలని కోరారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యకు అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని విద్యార్థులకు సంఘాలు అండగా నిలవాలన్నారు.సంఘాలు కేవలం పదవులు, విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచినప్పుడే వాటికి సార్థకత ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. సమాజంలో ఎదిగిన వారు తిరిగి సమాజానికి సేవ చేయాలన్నారు. పేద విద్యార్థుల విద్యకు సహాయం చేస్తున్న దాతల సేవలను అభినందించారు.సిద్దిపేటలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ లేదా పాఠశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని సూచించిన హరీశ్ రావు.. కమిటీ నిర్ణయం తీసుకుంటే తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్. చంద్రశేఖర్ రెడ్డి, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు వంగ తిరుమల్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కూర మాణిక్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి సద్ది నాగరాజు రెడ్డి, సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.
