సిద్దిపేట, మార్చి 13 ,(ప్రజాజ్యోతి): పుస్తెలతాడు సైజు తీసుకుంటామని నమ్మబలికి అసలు బంగారు తాడును కాజేసిన ఇద్దరు నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన గున్నాల అనురాధకు ఆమె మేనమామ కొడుకు ఎల్లరాజు తండ్రి శ్రీనివాస్, గత ఏడాది డిసెంబర్ 19న ఫోన్ చేసి తన భార్యకు పుస్తెలతాడు చేయించాలంటూ ఆమె మెడలో ఉన్న తాడును సైజు కోసం ఇవ్వాలని కోరాడు. దీంతో అనురాధ సిద్దిపేటకు రాగా పారుపల్లి వీధిలోని భానుశ్రీ జ్యువెలర్స్‌కు తీసుకెళ్లి అక్కడ గోల్డ్‌స్మిత్ సిరికొండ నాగరాజుతో కలిసి సైజు తీసుకుంటామని చెప్పి తాడును తీసుకున్నారు.కొంతసేపటి తర్వాత అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆమెకు పుస్తెలతాడును తిరిగి ఇచ్చారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత అది నకిలీదని గుర్తించిన అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు శుక్రవారం ఎల్లరాజు, నాగరాజులను అరెస్ట్ చేసి బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
