క్షణికావేశం గుండెకు శాపం.. అధ్యయనంలో వెల్లడి

V. Sai Krishna Reddy
2 Min Read

ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8 నిమిషాల పాటు గుర్తుచేసుకోమని చెప్పారు. ఆ సమయంలో వారిపై జరిపిన అధ్యయనం ద్వారా వెలుగు చూసిన ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రభావం ఎలా ఉంటుందంటే..

కోపంగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచించే (విచ్చుకునే) సామర్థ్యం దాదాపు సగానికి పడిపోతుంది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు 8 నిమిషాల పాటు కోపంతో ఉన్నప్పటికీ రక్తనాళాలపై దాని ప్రభావం మరో 40 నిమిషాల పాటు ఉందని పరిశోధకులు చెప్పారు. బాధ లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు రక్తనాళాలపై కోపం చూపించినంత తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదని వివరించారు.

రక్తనాళాలు బిగుసుకుపోవడం..

కోపం వల్ల రక్తనాళాలు బిగుసుకుపోతాయని పరిశోధకులు తెలిపారు. దీంతో రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని అన్నారు. తరచుగా ఇలా జరగడం వల్ల అధిక రక్తపోటు, ధమనులు దెబ్బతినడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెపోటు, పక్షవాతం తదితర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

గుండెను దెబ్బతీసేదిలా..

కోపం వచ్చినప్పుడు శరీరంలో ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ స్పందన మొదలవుతుంది. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తనాళాలను గట్టిపడేలా చేసి, రక్తపోటును మరియు హృదయ స్పందన రేటును పెంచుతాయి. ముంబైలోని సైఫీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నిమిత్ సి షా దీనిపై స్పందిస్తూ.. “ఒక్కసారి కోప్పడితే శాశ్వత నష్టం జరగకపోవచ్చు, కానీ తరచుగా కోపగించుకోవడం వల్ల రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటాయి, ఇది భవిష్యత్తులో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది” అని హెచ్చరించారు.

జీవనశైలి వల్ల ముప్పు..

నేటి ఆధునిక కాలంలో సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఇప్పటికే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంది. దీనికి తోడు ‘అదుపులేని కోపం’ తోడైతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యంగా ఉండే యువత కూడా తరచుగా కోపగించుకోవడం వల్ల తమ గుండె ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *