ఉత్కంఠ రేపుతున్న ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ అభిమానులకు శుభవార్త. ఈ సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూన్ 27 నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఈ సిరీస్ కొత్త సీజన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది. కథనం, నిర్మాణ విలువల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం గతేడాది చివర్లో విడుదలైన రెండో సీజన్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిరీస్ బృందం సిద్ధమైంది.

కొత్త ఆటలతో సరికొత్తగా
జీవితంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అప్పులపాలైన కొందరిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి, చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలను ప్రాణాలతో చెలగాటమాడేలా ఆడించడమే ఈ సిరీస్ ముఖ్య కథాంశం. ఆరు రకాల ఆటల్లో ఓడిపోయిన వారు ప్రాణాలు కోల్పోతారు. చివరి వరకు ప్రాణాలతో నిలిచి, అన్ని ఆటల్లో గెలిచిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతి లభిస్తుంది. చివరి వరకు ఉత్కంఠ రేపే కథనంతో సాగే ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మూడో సీజన్ ఎలాంటి మలుపులతో, కొత్త ఆటలతో రానుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *