ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో ఆమె మొక్కు తీర్చుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద చెక్కు రూపంలో అధికారులకు అందజేశారు.
అంతకుముందు అన్నా లెజినోవా వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం నాడు ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి, కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో అన్నా లెజినోవా తిరుమలలోని గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాలను అనుసరించి, మాడ వీధుల్లో శ్రీ భూ వరహా స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూ వరహా స్వామి దర్శనం తర్వాత కల్యాణకట్టకు చేరుకొని భక్తులతో కలిసి తలనీలాలు సమర్పించారు. వివాహానికి ముందు క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తర్వాత హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ తో కలిసి వివిధ దేవాలయాలను సందర్శించారు. ఇటీవల కుంభమేళాలో కూడా పవన్ తో కలిసి పవిత్ర స్నానం చేశారు. అయితే తిరుమలలో ఆమె సాధారణ భక్తురాలిగా తలనీలాలు సమర్పించడం .. డిక్లరేషన్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసేన కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాలని కోరుతున్నారు. మొత్తానికి తన కుమారుడి క్షేమం కోసం అన్నా లెజినోవా చేసిన ఈ భారీ విరాళం.. ఆమె తిరుమల సందర్శనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.