అధిక ఉష్ణోగ్రతలకు ఢిల్లీ పెట్టింది పేరు
క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసిన ప్రిన్సిపాల్
పరిశోధనలో భాగంగా ఇలా చేశామని వెల్లడి
అన్ని కాలాల్లోకి వేసవి కాలం అందరినీ హడలెత్తిస్తుంటుంది. ఎండవేడిమి, వడగాడ్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు సతమతం అవుతుంటారు. అయితే, ఢిల్లీలోని ఓ కాలేజి ప్రిన్సిపాల్ ఎండవేడిమి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏంచేశారో చూడండి.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కాలేజికి డాక్టర్ ప్రత్యూష్ వత్సల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడివేసవిలో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఆమె వినూత్న చర్యలు తీసుకున్నారు. ఆవుపేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు. ఇలా చేయడం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు.
వేసవిలో గదులను కూల్ గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవుపేడ పూశామని, మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.