చెన్నై మెట్రో చేసింది.. హైదరాబాద్ మెట్రో మాటేంటి?

V. Sai Krishna Reddy
2 Min Read

వావ్ అనేలా ప్రత్యేక ఏర్పాటు చేసింది చెన్నై మెట్రో రైల్. చెన్నైలోని మెట్రో రైల్లో ప్రయాణించేందుకు వీలుగా దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం స్పెషల్ రోల్ ఔట ర్యాంపుల ఏర్పాటుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ వసతి కారణంగా దివ్యాంగులు సులువుగా రైలు ఎక్కడటానికి.. దిగేందుకు సాయంగా నిలుస్తాయి

తాజాగా తీసుకొచ్చిన ఈ ఏర్పాటు చెన్నై మెట్రో మొదటిదశ 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. పదేళ్ల క్రితం చెన్నైలో మెట్రో రైలు సేవలు షురూ అయిన విషయం తెలిసిందే. అయితే.. మెట్రో రైల్లో ప్రయాణించాలనుకునే దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యం లేదు. ఈ విషయంలో జపాన్ రైల్వే వారిని స్ఫూర్తిగా తీసుకున్న చెన్నై మెట్రో రైలు అథారిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను తీసుకొచ్చారు.

చక్రాల కుర్చీలో కూర్చొన్న వారు తేలిగ్గా మెట్రో రైలు ఎక్కేందుకు.. ప్రయాణం పూర్తైన తర్వాత బయటకు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ట్రైన్ బోగీ నుంచి ప్లాట్ మీదకు వచ్చే దానికి మధ్య ఖాళీ ప్రదేశం ఉండటం తెలిసిందే. ఈ ఇష్యూను అధిగమించేందుకు ప్రత్యేక ర్యాంపుల్ని తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో.. రోల్ ఔట్ ర్యాంపుల్ని త్వరలో కొనుగోలు చేసి.. అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు.

జపాన్ లో ఎలా అయితే వినియోగిస్తున్నారో.. అదే రీతిలో చెన్నైలోని మెట్రోలో కూడా తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ లోకి రావటానికి.. రైలు ఎక్కించేందుకు వీలుగా తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. దివ్యాంగులు ఏ స్టేషన్ కు దిగాలో.. ఆ స్టేషన్ లోని సిబ్బందికి సమాచారం అందించటం ద్వారా.. దివ్యాంగ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం సదరు దివ్యాంగ ప్రయాణికుడు ట్రైన్ దిగేందుకు వీలుగా రైలు వద్దకు ఒక స్టేషన్ ఇన్ ఛార్జిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చెన్నై మెట్రోకు సంబంధించి రెండో దశలోని 118.9 కి.మీ. మార్గంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మొదటి దశలో ఈ ర్యాంపుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన మార్గాల్లోనూ ఏర్పాట్లు చేస్తారు. ఈ రోల్ ఔట్ ర్యాంపులు దివ్యాంగ ప్రయాణికులకు ఎంతో సాయంగా ఉంటాయని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. ఇలాంటి సౌకర్యం చెన్నై మెట్రోకే ఎందుకు పరిమితం కావాలి? హైదరాబాద్ మెట్రో రైల్ లో ఎందుకు ఏర్పాటు చేయకూడదు?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *