గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి: కొప్పుల మహేష్‌రెడ్డి

Vikarabad Staff Reporter
2 Min Read

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి: కొప్పుల మహేష్‌రెడ్డి

అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి

క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులకు పిలుపు

పరిగి, అక్టోబర్ 03 (ప్రజాజ్యోతి): మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నివాసంలో పరిగి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వికారాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించి, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ముఖ్యంగా విద్యావంతులు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, ప్రజా సమస్యలను విస్తృతంగా చర్చించాలన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు మీర్ మహేమూద్ అలీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.
ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏ. సురేందర్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు మీర్ తాహేర్ అలీ, రవికుమార్, మిదిగడ్డ శ్రీనివాస్, మాదారం సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *