రాజ్యాంగ విలువలను విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయులు

Medak staff Reporter
1 Min Read

పీఎం శ్రీ పాఠశాల వెల్దుర్తిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

మెదక్ :మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించేలా వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్గదర్శకమని, ప్రతి పౌరుడికి హక్కులతో పాటు కొన్ని కీలక బాధ్యతలను కూడా కల్పించిందని వివరించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి, ఆయన పాత్రను విద్యార్థులకు వివరించారు.కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే రాజ్యాంగంలోని గొప్పతనమని పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలను విద్యార్థులు చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి సృజనాత్మక పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని రాజ్యాంగ అంశాలను తమ ఆలోచనలు, చిత్రాల ద్వారా వ్యక్తపరిచారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి బహుమతులు అందజేశారు.పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా దేశ చరిత్ర, రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *