పాఠాలు బోదించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ 

Warangal Bureau
2 Min Read

పాఠాలు బోదించిన హనుమకొండ జిల్లా కలెక్టర్

విద్యార్థుల అభ్యసన స్థాయి మరింత మెరుగుపడాలని

దామెర, నవంబర్ 25 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు పాఠాలు బోదించారు. బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వారి అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనానికి ముందు అందించే అల్పాహారం, పాలు పంపిణీ తదితర అంశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మొదటి, రెండో, మూడో తరగతుల విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారు రాసిన నోట్‌బుక్‌లను పరిశీలించారు. విద్యార్థులు రాసిన పదాల అర్థాలు తెలుసా అని వారి అభ్యసన స్థాయిని పరీక్షించారు. విద్యార్థులు పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో వెరీ గుడ్ అంటూ విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా నాలుగు, ఐదు తరగతులను సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశాన్ని చదివించారు. ఫిజికల్ సైన్స్ సంబంధించి విద్యార్థులు బోర్డుపై రాసిన విధానం, చెప్పిన సమాధానాలు సరిగ్గా ఉండటంతో అదే కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. లైబ్రరీ రూమ్ ఉందా అని ఆరా తీశారు. ఎనిమిదో తరగతి సందర్శించి ఖాన్ అకాడమీ పాఠ్యాంశాలను వింటున్నారా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలా లాగిన్ అవుతున్నారని ఆరా తీశారు. పాఠశాలకు సంబంధించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను ఉపాధ్యాయులు మరింతగా పెంపొందించాలన్నారు. సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలకు సంబంధించి మిగిలి ఉన్న భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను అందించాలని పంచాయతీరాజ్ ఏఈ ని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజు, స్థానిక తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంఈఓ జుమ్మా నాయక్, జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *