తెలంగాణ ఉద్యమ చరిత్రకు దీక్షా దివస్‌ చిరస్మరణీయం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు 17 ఏళ్లు.. ఈ నెల 29న కోస్గిలో కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి సభ

Vikarabad Staff Reporter
2 Min Read
  1. తెలంగాణ ఉద్యమ చరిత్రకు దీక్షా దివస్‌ చిరస్మరణీయం

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు 17 ఏళ్లు..

ఈ నెల 29న కోస్గిలో కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి సభ

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హాజరు

‌ కొడంగల్ నవంబర్ 27 ప్రజా జ్యోతి న్యూస్ :

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు 17 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దీక్షా దివస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్‌ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని బీఆర్ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి దీక్షా దివస్‌ సభను ఈ నెల 29న కోస్గిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం కొడంగల్‌లోని తన నివాసంలో కౌన్సిలర్‌ వాణిశ్రీ మధుసూదన్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2009 నవంబర్‌ 29న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని, పోలీసుల అరెస్టు, నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా 11 రోజులపాటు దీక్షను కొనసాగించారని గుర్తుచేశారు. ఆయన దీక్షతో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ఈ ఉద్యమం కీలక నేపథ్యంగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్‌ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, ఆయన నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టిందని ఆరోపించారు.
ఈ నెల 29న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కోస్గిలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి దీక్షా దివస్‌ సభ నిర్వహించనున్నట్లు వాణిశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు.
నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షా దివస్‌ సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో బాకారం అరుణ్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *