తూప్రాన్ ప్రజా జ్యోతి అక్టోబర్ 2 :
ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులపై పెరుగుతున్న బోధనేతర పనిభారాన్ని తగ్గించాలని, జీవో నంబర్ 25ను తక్షణమే రద్దు చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (SGTU) రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
SGTU రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా SGTU రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించకుండా, పరిమిత సంఖ్యలో ఉపాధ్యాయులతో అనేక తరగతులు, సబ్జెక్టులు నిర్వహించడం వల్ల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు.
ఒకవైపు ఐదు తరగతులు.. మరోవైపు 18 సబ్జెక్టులు..
దీనికి తోడు FLN, రిమీడియల్ టీచింగ్, అలైన్‌మెంట్, రిపోర్టులు, సమావేశాలు, శిక్షణలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు వంటి అనేక బోధనేతర బాధ్యతలు ఉపాధ్యాయులపై పడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి పెట్టే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తరగతికి ఒక ఉపాధ్యాయుడు.. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే AXEL పాఠశాలలకు శిక్షణ పొందిన కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని కోరారు.
విద్యా సంవత్సరం సగం పూర్తవుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో సుమారు 40 వేల మంది SGT ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తున్నారని, ప్రభుత్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు.
జీవో నంబర్ 25ను వెంటనే రద్దు చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పటిష్టమైన ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఊకంటి విజయేందర్ రెడ్డి, జింక అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సత్యం, నర్సాపూర్ మండల అధ్యక్షుడు గణేష్, తూప్రాన్ మండల అధ్యక్షుడు లచ్చగొని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
