కుమ్మరికి కోటి రూపాయల జీఎస్టీ నోటీసు.. చూసి షాక్!

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ నిరుపేద కుమ్మరి కుటుంబానికి ఊహించని షాక్‌కు ఎదురైంది. మట్టి కుండలు అమ్ముకుంటూ జీవనం సాగించే మహమ్మద్ సయీద్‌కు, జీఎస్టీ విభాగం ఏకంగా రూ.1.25 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. దీంతో ఆ కుటుంబం లబోదిబోమంటూ తలపట్టుకుంది.

రాయ్‌బరేలీ జిల్లా హర్‌చంద్‌పూర్ వాసి అయిన సయీద్, తన ఐదుగురు కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి రోజంతా కష్టపడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం రుణం కోసం ప్రయత్నించినప్పుడు, ఓ వ్యక్తి ఆయన నుంచి పాన్, ఆధార్ కార్డులు తీసుకున్నాడు. అయితే లోన్ మంజూరు కాలేదు, ఆ పత్రాలు కూడా తిరిగి రాలేదు. ఇదే అదనుగా భావించిన కొందరు మోసగాళ్లు, ఆ పత్రాలను ఉపయోగించి సయీద్ పేరు మీద బిహార్‌లోని పాట్నాలో నాలుగు కంపెనీలను రిజిస్టర్ చేసి, కోట్ల రూపాయల లావాదేవీలు నడిపారు.

నిజానికి ఆరు నెలల క్రితమే జీఎస్టీ శాఖ నుంచి తొలి నోటీసు వచ్చింది. అయితే, నిరక్షరాస్యుడైన సయీద్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఫిబ్రవరి 15న రెండోసారి నోటీసు రావడంతో, అనుమానంతో ఇతరులతో చదివించగా అసలు విషయం బయటపడింది. రూ.1.25 కోట్ల పన్ను బకాయి ఉందని తెలియగానే ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. “మా వల్ల తప్పు జరిగితే దొంగల్లా శిక్షించండి, కానీ సంబంధం లేని పన్నుతో మమ్మల్ని చంపకండి” అని సయీద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ సయీద్ తన కుమారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు, సయీద్ పత్రాలు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా గుర్తించి, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు తమ ఆధార్, పాన్ కార్డుల వివరాలను అపరిచితులకు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *