ప్రపంచవ్యాప్త ట్రావెల్ వీడియోలతో సంచలనం సృష్టించిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగైంది. 1.3 మిలియన్ (13 లక్షలు) ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్ బ్యాన్ కావడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే… గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని దూషించారని నటి కరాటే కల్యాణి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్ట్‌లు ఉన్నట్లు గుర్తించారు. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాసి అకౌంట్ వివరాలు సేకరించారు. తర్వాత మరో లేఖలో విద్వేషపూరిత కంటెంట్ ఉందని, తక్షణమే అకౌంట్ తొలగించాలని కోరారు.
ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం పోలీసుల లేఖపై స్పందిస్తూ… అన్వేష్ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయిన వెంటనే బ్యాన్ చేసింది. ప్రస్తుతం అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించడం లేదు.
