పోలీస్ అమరవీరులకు ఘన నివాళి- పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేష్ మీనా

Vikarabad Staff Reporter
1 Min Read

పోలీస్ అమరవీరులకు ఘన నివాళ

పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు ఎస్పీ రాజేష్ మీనా

పరిగి, అక్టోబర్ 27 (ప్రజాజ్యోతి): పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా పరిగి పట్టణంలో మంగళవారం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, పాల్గొని పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పరిగి బస్టాండ్ నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, పరిగి సీఐ కొండల్ రెడ్డి, కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల చిత్రపటానికి ఎస్పీ, అదనపు ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, విద్యార్థులు నివాళులర్పించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని అన్నారు.
యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ తెలిపారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం సేవలందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *