‘వసుధ, శివం’ మొక్కజొన్న బకాయిల కోసం రోడ్డెక్కిన రైతులు..!

Warangal Bureau
2 Min Read

‘వసుధ, శివం’ మొక్కజొన్న బకాయిల కోసం రోడ్డెక్కిన రైతులు..!

రూ. 6 కోట్ల వరకు బకాయిలు..

న్యాయం చేయాలని రైతుల డిమాండ్

ఆత్మకూరు, అక్టోబర్ 16 (ప్రజాజ్యోతి):

వసుధ, శివం కంపెనీలు రైతులకు ఏకంగా 6 కోట్ల వరకు టోకరా పెట్టాయి. 2025 సంవత్సరం రబీ సీజన్ లో ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏజెంట్స్ పుట్టుకొచ్చి కమిషన్ కోసం రైతులను ఒప్పించి ‘మేల్ ఫిమేల్’ మొక్కజొన్న పంట వేయించారు. మొక్కజొన్న విత్తనాల ఇచ్చి, పండిన మొక్కజొన్న పంటలను తీసుకెళ్లిన విక్రయాలకు సంబంధించిన బకాయిలు ఇంత వరకు చెల్లించలేదు. కంపనీకి చెందిన ప్రతినిధుల ఫోన్ లు పని చేయటం లేదు. దీంతో విసుగు చెందిన రైతులు తమ పంట డబ్బులు చెల్లించాలంటూ రోడ్డెక్కారు. హనుమకొండ – పరకాల ప్రధాన రహదారిపై రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు సీడ్ కంపెనీ నుంచి సుమారు 8 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. పరకాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు శాయంపేట మండలం సింగారం గ్రామ నివాసి శ్రీనివాస్ అనే వ్యక్తి సదరు సీడ్ కంపెనీలను రైతులకు పరిచయం చేసి, కమిషన్ పొందాడు. కంపెనీతో జరిగిన లావాదేవీలకు సంబంధించి రైతులకు రావాల్సిన డబ్బులు సకాలంలో అందకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. శుక్రవారం రైతులు సదరు సీడ్ ఏజెంట్ శ్రీనివాస్ ఇంటి ముందు నిరసన తెలిపి, పరకాల ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. రైతులు వచ్చే విషయం తెలుసుకున్న సదరు డీలర్ పారిపోయినట్టు రైతులు పేర్కొన్నారు. పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు, తమకు రావాల్సిన బకాయిలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులు స్పందించి బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు రావాల్సిన బకాయిలపై సంబంధిత అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *