గణపురం ప్రజా జ్యోతి మార్చ్ 01
గణపురం మండలం కేంద్రం లో పెండ్యాల సంపత్ మాట్లాడుతూ ఇప్పటివరకు కుల వ్యవస్థలో వివిధ కులాల మధ్య జరిగిన పోరాటాలు ఘర్షణలు, అగ్రకుల పార్టీలైన కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టు పార్టీలు జరిపిన ఉద్యమాలు నిర్వహించిన పోరాటాలు భూస్వామ్య పెట్టుబడిదారుల ప్రయోజనాల రక్షణ కొరకే జరిగాయి. అగ్రకులాల మధ్య సంపద పంపిణీ కొరకు, భూముల పంపిణీ కొరకు, వారికున్న పదవుల రక్షణ కొరకు, రాజకీయ ఆధిపత్యం కొరకు, అగ్రకులాల రాజకీయ దళారుల బ్రోకర్ల మధ్యన జరిగిన ఉద్యమాలు ఘర్షణలే తప్ప, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాల కొరకు జరిగినవి కావు. అలాగే ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలకు పోరాటాలకు నాయకత్వం వహించింది అగ్రకులాల వాళ్లే. అందుకే బీసీల త్యాగాలు, అగ్రకులాల భోగాలుగా మారాయి. ఉదాహరణకు కేసీఆర్ ఉద్యమాన్ని చూస్తూనే తెలుస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఘర్షణలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు. ఆంధ్ర వాళ్ళతో యుద్ధాలు చేశారు.కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ప్రతిసారి అగ్రకులాలకు ఓట్లు వేశారు. ఈ త్యాగాలు ఉద్యమాలు బీసీల మౌలిక సమస్యల పరిష్కారానికి జరుపడ్డవి కావు. నిజానికి కులాధిపత్యాలను కలిగి ఉండటానికి జరుపబడ్డ పోరాటాలే. ఇప్పటివరకు జరిగిన బిసి పోరాటాలన్నీ ఆధిపత్య కులాలను అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. చివరికి బీసీలను అగ్రకుల పార్టీలకు బానిసలుగా ఆధారపడేటట్లు దిగజార్చారు. వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఎదురుచూచేటట్లు దిగజార్చారు. ప్రతి సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాలకు సంబంధించి బ్రతిమిలాడించుకున్నారు. కాళ్ళు మొక్కించుకున్నారు. ఈసడించుకున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొట్టారు చంపారు. వాళ్ళిచ్చే కూలినే తీసుకోవాలి. వాళ్ళు ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలి. వాళ్ళు ఎవరికి ఓటు వేయమంటే వారికి వేయాలి. ఈ విధంగా అగ్రకుల రాజకీయ పార్టీ విధానంలో పెత్తందారి విధానమే కొనసాగింది. వాళ్ల దయతో ఒకటో రెండో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే పోటీ చేశారు. లేకపోతే ఎదురుచూస్తూ కూర్చున్నారు. దయతలిచ్చి మంత్రి పదవి ఇస్తే ఎంతో సంతోషంతో తీసుకున్నారు. ఇవ్వకపోతే ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఈ విధంగా బానిసలైన ఎమ్మెల్యేలు అగ్రకులాల దగ్గర నిరీక్షణ చేశారు. లేదా అడుక్కున్నారు. ఇప్పటివరకు బీసీలు తమకు కచ్చితంగా రావలసిన వాటాను ఎప్పుడూ అడగలేదు. ఇప్పటివరకు బీసీలు అగ్రకుల పార్టీలైన టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీలపై ఆధారపడేటట్లుగానే దిగజార్చబడ్డారు. స్వతంత్రంగా తమ సమస్యలపై ఉద్యమాలను నిర్మించుకొని రాజ్యాధికారం కోసం పోరాటం చేసింది లేదు. ఇప్పటివరకు జరిగిన రాజకీయాలు పెట్టుబడిదారుల చుట్టూ, గుడిల చుట్టూ మాత్రమే భూ భ్రమణం లాగా తిరుగుతున్నాయి. అంతేగాని బీసీలకు పట్టు దొరకడం లేదు. ఇప్పటివరకు అగ్రకులాలు చేసిన ఉద్యమాల్లో బీసీలు పాల్గొనకపోతే ఆ ఉద్యమాల్లో వారు విజయం సాధించలేకపోయారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అగ్రకులాలు పోరాటం చేసే వాళ్ళు కాదు. అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భూమి పరిశ్రమలు వాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి పదవులన్ని వాళ్లకె లభించాయి. ఎస్సీలు బీసీలు మునుపటి లాగే ఆర్థిక రాజకీయ స్వాతంత్రం లేకుండా ఉన్నారు. సంవత్సరాల తరబడి ఈ బ్రాహ్మనిస్ట్ పార్టీలు బీసీలకు రాజకీయం అంటే ఏమిటో తెలియకుండా రాజకీయ అనాధలుగా, రాజకీయ యాచకులుగా దిగజార్చారు. అగ్రకులాల దృష్టిలో రాజకీయం అంటే వారి కుటుంబాల వ్యక్తులకు కొన్ని ప్రత్యేక ఆధిపత్యాలను అధికారాలను ప్రయోజనాలను కలుగజేసుకోవటం. బీసీల సమస్యలు వచ్చేవరకు బ్రాహ్మణిస్ట్ పార్టీలు మందిరం సమస్యను దేవుని సమస్యను ముందుకు పెట్టి ఉద్యమాలు చేస్తారు. బీసీల సమస్యలను తెరమరుగు పట్టిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుల వ్యవస్థలో ఏ మార్పు జరగాలన్న, ఎటువంటి రాజకీయ సంస్థలు జరగాలన్న అగ్రకులాల నాయకత్వంలోనే జరగాలని కోరుకుంటారు. ఏ చట్టం తెచ్చిన ఏ శాసనం తెచ్చిన తామే తేవాలనుకుంటారు. తమ ఆజ్ఞల మేరకు,తమ పరిధిలోబడే ఉండాలనుకుంటారు. అగ్రకులాలు చేసిన ఉద్యమాలు పోరాటాలే న్యాయబద్ధమైనవని నమ్మిస్తారు. ఇకనైనా బీసీలు ఒక తాటి మీదికి వచ్చి మనమెంతో మనకంత వాటా దిశగా కొట్లాడకుంటే బీసీలకు రాజ్యాధికారం సత్య దూరమే అన్నారు ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు జంగిలి శ్రీనివాసరావు జిల్లా నాయకులు గండు రమేష్ తదితరులు పాల్గున్నారు.