న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువ
– మరిపెడలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
– త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
– హైకోర్టు జస్టిస్ ఈవీ వేణుగోపాల్
మరిపెడ, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి):
కోర్టులు ప్రజల హక్కులకు రక్షణగా నిలవడంతో పాటు,వివిధ సమస్యలతో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం,ధర్మం చూపే మార్గదర్శకాలుగా ఉండాలని హైకోర్టు జస్టిస్, మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఈవీ వేణుగోపాల్ అన్నారు.మరిపెడలో కోర్టు ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారని,కోర్టు ప్రారంభంతో వారి నిరీక్షణకు తెరపడిందన్నారు.ఇకపై స్థానికంగానే సత్వర న్యాయ సేవలుఅందుబాటులోకి వస్తాయని తెలిపారు.శనివారం మరిపెడలో జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించారు.జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కే.మురళీమోహన్, హైకోర్టు జస్టిస్‌లు నామవరపు రాజేశ్వరరావు,బి.ఆర్.మధుసూధన్రావులతో కలిసి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,ఎస్పీ డాక్టర్ శబరీష్, మహబూబాబాద్,తొర్రూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.
1,000 కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
ఈ సందర్భంగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మాట్లాడుతూ..మరిపెడ కోర్టు పరిధిలో ప్రస్తుతం సుమారు 1,903 కేసులు ఉన్నాయని తెలిపారు. తాము మరోసారి కోర్టును సందర్శించే సమయానికి కనీసం 1,000 కేసులు పరిష్కరించేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.దేశంలోని నాలుగు వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తూ భవిష్యత్ తరాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు,ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.న్యాయవ్యవస్థలో బెంచ్,బార్ కలిసి పనిచేసినప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన భారత రాజ్యాంగంపై ప్రతి పౌరుడు, ముఖ్యంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నారులకు వారి హక్కులు,చట్టం, న్యాయం తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతోందని,త్వరలోనే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా జిల్లా కోర్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో కోర్టుల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.మరిపెడలో కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన తొర్రూరు,మహబూబాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.
– మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
– హైకోర్టు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు
దేశంలో రోజురోజుకూ కక్షలు, వివాదాలు,కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అన్నారు.దేశవ్యాప్తంగా సుమారు 5.3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని కేసులు చేరుతున్నాయని తెలిపారు.ఈ సమస్యకు మధ్యవర్తిత్వం (మిడియేషన్) ఒక ముఖ్యమైన పరిష్కార మార్గమన్నారు.సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో,అన్ని కోర్టుల్లో మిడియేషన్ సెంటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.మరిపెడ కోర్టులో 15 కేసులను కక్షిదారులు మధ్యవర్తిత్వంద్వారాపరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మధ్యవర్తిత్వ ప్రక్రియలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని, మిడియేషన్ పేషీకి ఒక రోజు ముందే కేసు ఫైల్‌ను పూర్తిగా అధ్యయనం చేసి,కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు.ప్రస్తుత కార్పొరేట్ సంస్కృతి కాలంలో న్యాయవాదులు సామాజిక స్పృహతో పనిచేస్తూ కక్షిదారులకు న్యాయం అందేలా చూడాలని అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వాసిగా, మరిపెడ సమీపంలోని తన స్వగ్రామం సూదనపల్లి జ్ఞాపకాలను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గుర్తుచేసుకున్నారు.
-తగ్గిన దూరాభారం
– హైకోర్టు జస్టిస్ బి.ఆర్. మధుసూధన్‌రావు
మరిపెడ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు కోర్టు పేషీల కోసం సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని హైకోర్టు జస్టిస్బి.ఆర్.మధుసూధన్‌రావు అన్నారు. జస్టిస్ ఈవీ వేణుగోపాల్ చొరవతో మరిపెడలో కోర్టు ఏర్పాటు కావడంతో స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు.మరిపెడ కోర్టు పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సుమారు 2,000 కేసులు ఈ కోర్టుకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పనిచేయాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో న్యాయమూర్తులు,న్యాయవాదులు, రెవెన్యూ,పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు,కోర్టు సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

