గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి విస్తరణకు మార్గం సుగమమైంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేయనున్న ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాల సవరణకు సంబంధించిన ఆర్డినెన్సులపై ఆయన ఆమోద ముద్ర వేశారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై, హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల, దానిని ఆనుకుని ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విలీన ప్రక్రియ అధికారికంగా ముందుకు సాగనుంది.
ఈ విలీనం పూర్తయితే హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. మొత్తం ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ మహా నగరంలో ఆరు పార్లమెంటు, 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. గవర్నర్ ఆమోదంతో తదుపరి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి మార్గం సులభమైంది.
