ఇవాళ్టి నుంచి అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్లు

V. Sai Krishna Reddy
1 Min Read

సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ నెల 30వ తేదీన అప్పన్న స్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని తిలకించి అప్పన్న స్వామి కృపాకటాక్షాలు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

ఈ నేపథ్యంలో సింహగిరిపై అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కె. సుబ్బారావు వెల్లడించారు. అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం ఈ నెల 24వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఈవో పేర్కొన్నారు.

అయితే, 29వ తేదీ తర్వాత ఎలాంటి విక్రయాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. దర్శనం టికెట్లు లభించే ప్రాంతాల వివరాలను ఆయన తెలియజేశారు. సింహగిరిపై పాత పీఆర్ఓ కార్యాలయం వద్ద ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ శాఖల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంకు శాఖలు, బిర్లా కూడలి, సాలిగ్రామపురంలోని ఎస్‌బీఐ కార్యాలయాల్లో పని వేళల్లో టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చని ఈవో తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *