పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

Warangal Bureau
1 Min Read

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, నవంబర్ 28 (ప్రజాజ్యోతి):

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్‌పాయి సూచించారు. ఎమ్మెల్సీ ప్రత్యేక ప్రచార దినాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్రం ఆదేశాల మేరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హనుమకొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 70, 71, 72, 73లను జిల్లా కలెక్టర్ సందర్శించి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు నమోదైన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య, శనివారం ఎన్ని ఫారం-18 దరఖాస్తులు పంపిణీ చేశారు, వాటిలో ఎన్ని దరఖాస్తులు పూర్తిచేసి సమర్పించారు.. అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక ప్రచార దినాల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), నియమించిన సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అవసరమైన ధ్రువపత్రాలతో ఫారం-18 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి. రవీందర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విట్టలేశ్వర్, వెరిఫికేషన్ ఆఫీసర్ శోభ, బీఎల్ఓలు అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *