కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే శశిథరూర్ మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. శశిథరూర్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కే మురళీధరన్.. శశిథరూర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై థరూర్ మాలో ఒకరు కాదు అంటూ మురళీధరన్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలకు బలం చేకూరుతోంది.
శశిథరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నామని, అందుకే ఆయనను తిరువనంతపురంలో తాము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు పిలవకూడదని నిర్ణయించుకున్నామని మురళీధరన్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని మురళీధరన్ పేర్కొనడం గమనార్హం.
థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ మురళీధరన్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.