400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని పేర్కొన్న ప్రభుత్వం
20 ఏళ్లకు పైగా న్యాయవివాదంలో ఉందన్న ప్రభుత్వం
చెట్లు మొలిచి అటవీ ప్రాంతంగా మారిందని అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రభుత్వం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూములు ప్రభుత్వ భూములేనని అందులో పేర్కొంది. ఈ భూముల్లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం, మరికొన్ని సంస్థలు, బస్టాండ్ వంటివి వచ్చాయని తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా ఈ 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉండటంతో అక్కడ చెట్లు మొలిచి అటవీ ప్రాంతంగా మారిందని అఫిడవిట్‌లో పేర్కొంది.
కంచ గచ్చిబౌలి వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదులతో ఈ అఫిడవిట్‌ను సిద్ధం చేశారు. ఈరోజు దీనిని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.