ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును 163 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ, ఆపై 164 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో 58 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 15, స్టబ్స్ 38 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ చెరో 37 పరుగులు చేశారు. కోహ్లీ 22, కెప్టెన్ రజత్ పటీదార్ 25, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 5 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది రెండో పరాజయం కాగా, ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది