ఇటీవల కాలంలో యూట్యూబర్లు విపరీత చేష్టలకు పాల్పడుతుండడం తెలిసిందే. వ్యూస్ కోసం బరితెగిస్తున్న ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కోనసీమ జిల్లా అమలాపురంలో మందపాటి ఆదిత్య అనే యూట్యూబర్ ఏకంగా గోల్డ్ హంట్ పేరిట ప్రాంక్ వీడియో సృష్టించాడు.
అమలాపురంలోని బాలయోగి స్టేడియం మైదానంలో బంగారం, వెండి, ఇయర్ ఫోన్స్ దాచామని… దొరికినవాళ్లు తీసుకోవచ్చని ఆ యూట్యూబర్ ప్రకటించాడు. ఇంకేముంది… బంగారం దొరుకుతుందన్న ఆశతో జనాలు బాలయోగి స్టేడియం బాటపట్టారు. మైదానం నిండా గుంతలు తవ్వారు.
అయితే, నిక్షేపంగా ఉన్న గ్రౌండ్ ను పాడు చేశారంటూ క్రీడాధికారి సదరు యూట్యూబర్ పై మండిపడ్డారు. కాగా, కలెక్టర్ ఆదేశాలతో యూట్యూబర్ మందపాటి ఆదిత్యపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది