తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘పాలమ్మిన… పూలమ్మిన… బోర్లు వేసిన… సక్సెస్ అయ్యా’ అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేరు. ఈ మాస్ డైలాగ్ జనాలను ఊపేసింది. తాజాగా ఆయన మరోసారి సందడి చేశారు. పాల డబ్బా ఉన్న స్కూటర్ పై ఆయన చక్కర్లు కొట్టారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు పాల డబ్బాతో ఉన్న స్కూటర్ కనిపించింది. దీంతో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో ఏమో కానీ వెంటనే స్కూటర్ ఎక్కారు. స్కూటర్ నడుపుతూ సందడి చేశారు. స్కూటర్ పై పాలు అమ్ముతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. కార్యకర్తలు, ప్రజలతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.