ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల నిండు ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతామని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమాజ హితం కోసం హెడ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. నిరుపేద విద్యార్థులకు, రైతులకు, ప్రజలకు ఎల్లవేళలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. నిస్వార్థంతో చేస్తున్న ఈ సేవలను ప్రజలేప్పుడూ మర్చిపోరని అన్నారు.
గ్రామీణ స్థాయిలలో హెడ్ సొసైటీ సంస్థ సేవలను విస్తరింపజేయాలని సూచించారు. అనంతరం రక్తదాన శిబిరంను ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులకు పండ్లను పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి లో భాగంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో హెడ్ సొసైటీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జాదవ్ శ్రీకాంత్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావ్, ఆదిలాబాద్ జిల్లా ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యుం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్బాల్, మాజీ సర్పంచ్లు మర్సుకొల తిరుపతి, భీమన్న, కాంగ్రెస్ నాయకులు దాసండ్ల ప్రభాకర్, హెడ్ సంస్థ అధ్యక్షుడు జాదవ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాథోడ్ శ్రీకాంత్, డైరెక్టర్ శ్రీనాథ్, సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.