గ్రామ పంచాయతీ ఆటో టైర్లు మాయం..!

Warangal Bureau
1 Min Read

గ్రామ పంచాయతీ ఆటో టైర్లు మాయం..!

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన..!

నాలుగు రోజులుగా నిలిచిన చెత్త సేకరణ.. పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు!

ఆత్మకూరు, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ఆటో నుంచి రెండు టైర్లను ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆటోకు టైర్లు లేకపోవడంతో గత నాలుగు రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పట్టించుకునే వారేరీ..?!

గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిలిపి ఉంచిన ఆటోకు గల రెండు టైర్లను తొలగించి దుండగులు ఎత్తుకెళ్లడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో అందుబాటులో లేకపోవడంతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా పండుగ వేళ చెత్త సేకరణ నిలిచిపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రాత్రి గస్తీపై విమర్శలు.. సీసీ కెమెరాలేవీ?

పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే దొంగతనం జరగడం, గ్రామపంచాయతీ ఆటో టైర్లు మాయమైనా నిందితుల ఆచూకీ తెలియకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ మరింత పటిష్ఠంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి..

గ్రామపంచాయతీ ఆటోకు వెంటనే మరమ్మతులు చేయించి చెత్త సేకరణను పునరుద్ధరించాలని, పండుగ వేళ పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే దొంగతనంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని, రాత్రి గస్తీని పటిష్ఠం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *