వికారాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి పంట నష్టపరిహారం అందించాలి..

Vikarabad Staff Reporter
3 Min Read

వికారాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి

రైతులను ఆదుకోవాలి
పంట నష్టపరిహారం అందించాలి..

సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి

కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార

ప్రజా జ్యోతి:  వర్షాభావ  పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వికారాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో కరువు పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు సాగునీరు, తాగునీరు, పశుగ్రాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా గంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, సాగునీరు అందక పెట్టుబడులు నష్టపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. జిల్లాలో కరువు తీవ్రతను క్షేత్రస్థాయిలో అంచనా వేసి, బాధిత రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు రూ.50 వేలు, కూరగాయలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కొరత నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, పశువులకు మేత కొరత లేకుండా ఉచితంగా లేదా రాయితీపై పశుగ్రాసం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్థాయి నుంచే కరువు ఉపశమన చర్యలు ప్రారంభించి, గ్రామాలవారీగా పంట నష్టం, తాగునీటి ఎద్దడి, పశుగ్రాస సమస్యలను గుర్తించి బాధితులకు సహాయం అందించాలని సూచించారు. కరువు కారణంగా ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతుల కోసం ఉపాధి హామీ పనులను విస్తరించి, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రబీ సాగు సాధ్యంకాని ప్రాంతాల్లో రైతులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, నీరు అందుబాటులో ఉన్న బోరుబావుల వినియోగంలో రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

చెరువులు, బావులు, భూగర్భ జలాల లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగుకు అవకాశం కల్పించాలని, కౌలుకు భూములు తీసుకొని సాగు చేసిన వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి కూడా పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర లభించని సందర్భాల్లో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, భూగర్భ జలాలు, తాగు, సాగునీటి లభ్యతపై సమగ్ర వివరాలు వెల్లడించాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలకు సరఫరా చేస్తున్న నీటిని సమీక్షించి ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరువు ప్రభావిత పేద కుటుంబాల ఆహార భద్రత కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని కోరారు.

జిల్లాలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని గంటి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలో పరిష్కరించగల సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై సమగ్ర నివేదికలు పంపించాలని కలెక్టర్‌ను కోరారు. రైతులకు హామీలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఆర్థిక సహాయం అందించాలని, కరువు ప్రభావంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, గ్రామీణ ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు బాధిత రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో సావిత్రమ్మ , సుంకరి రాములు , చాకలి రవి , బాబు, సాయప్ప , తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *