బీసీల టార్గెట్‌గా కవిత ,మల్లన్న కొత్త పార్టీలు?

Karimnagar Bureau
2 Min Read

బీసీలే టార్గెట్‌గా కవిత ,మల్లన్న ల కొత్త పార్టీలు?

కరీంనగర్ బ్యూరో, సెప్టెంబర్ 08,(ప్రజజ్యోతి)

తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీల ఓటు బ్యాంకుపై దృష్టి సారించి కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో గణనీయమైన శాతం బీసీల ఓటర్లే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారనే వాస్తవం అన్ని పార్టీలకీ తెలుసు. ఈ నేపథ్యంలో బీసీ కంస్టిట్యూన్సీల్లో రెండుకోత్త పార్టీలు రంగప్రవేశం చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మల్లన్న కొత్త పార్టీ ఆవిష్కరణ

జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరొందిన టీవీ9 మాజీ యాంకర్ టీన్మార్ మల్లన్న ఇప్పటికే బహిరంగ వేదికలపై బీసీ హక్కుల కోసం కంఠతీయడం తెలిసిందే. ఈ నెల 17న తన కొత్త పార్టీ పేరును, జెండాను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తన పార్టీ పూర్తిగా బీసీ సమాజం ఆకాంక్షలకు ప్రతినిధ్యం వహిస్తుందని, ఎప్పటినుంచో నిర్లక్ష్యానికి గురవుతున్న బీసీలకు న్యాయం చేస్తామని ఆయన చెబుతున్నారు. స్థానిక సమస్యలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, విద్య – ఆరోగ్య రంగాల్లో తన పార్టీ శక్తివంతంగా పోరాడుతుందని ఆయన బృందం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది.

కవిత వ్యూహం

ఇక మరోవైపు,మాజీ ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ కీలక నాయకురాలుగా ఉన్న కవిత, బీసీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి కొత్త ఆలోచనలు చేస్తోన్నట్లు సమాచారం. బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేయాలని కవిత యోచిస్తున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలకు అదనపు సీట్లు కేటాయించడం, వర్గానికో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయడం, బీసీ నాయకత్వాన్ని బలపరచడం వంటి వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశముందని చెబుతున్నారు.

బీసీ ఓటు ప్రాధాన్యం

తెలంగాణలో బీసీలు మొత్తం ఓటర్లలో దాదాపు 50% వరకు ఉన్నారని అంచనా. ఇప్పటివరకు బీసీల ఓట్లు ప్రధానంగా టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్), కాంగ్రెస్, బీజేపీ మధ్య విభజించబడ్డాయి. కానీ, ఇప్పుడు బీసీ హక్కుల పేరిట ప్రత్యేకంగా పార్టీలు ఏర్పడుతుండటంతో, ఈ సమీకరణాలు తప్పక మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లన్న పార్టీ బీసీ యువతను ఆకర్షించే అవకాశం ఉండగా, కవిత తన రాజకీయ అనుభవం, ప్రభావాన్ని ఉపయోగించుకొని బీసీ వర్గాల్లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల్లో ప్రభావం?

ఈ రెండు కొత్త రాజకీయ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మల్లన్న పార్టీ నిజంగా బీసీ ఓటర్లను ఒకే తాటిపైకి తెచ్చి, గణనీయమైన ఓట్లు సాధిస్తే ప్రధాన పార్టీలకు తలనొప్పి తప్పదు. మరోవైపు కవిత తన వ్యూహాలతో బీసీలను తిరిగి జాగృతి పార్టీ వైపు మళ్లిస్తే, పార్టీకి శక్తివంతమైన బలం ఏర్పడుతుంది.అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో రాబోయే నెలలు బీసీ రాజకీయాలకు కొత్త దిశను చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చివరికి, బీసీ ఓటు బ్యాంకును ఎవరు కైవసం చేసుకుంటారన్నది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారిందనే చెప్పాలి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *