ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. 2018లో తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడికి మరణ శిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై అమృత స్పందించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.
ఈ కేసులో న్యాయం జరిగిందని, పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన నిరీక్షణ ముగిసిందని, న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని రాసుకొచ్చారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే అతని భవిష్యత్తును కాపాడుకోవడానికి నేను మీడియా ముందు కనిపించలేనని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. దయచేసి మా శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకొని గౌరవించాలని అభ్యర్థిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు.