నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో ఓట్లు, జనాభా తగ్గినప్పటికీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా తగ్గదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనపై అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందీ భాషను ఎవరి పైనా బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చెప్పారు. ఫైనాన్స్‌కు సంబంధించిన ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని ఆయన తెలిపారు.
పార్లమెంటు సమావేశాల అనంతరం ఈ పది జాతీయ రహదారులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ రహదారుల ప్రారంభోత్సవానికి గడ్కరీ రానున్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం విషయమై కూడా గడ్కరీతో చర్చించామని, భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తుందని అన్నారు. ఫ్లై ఓవర్ల కింద భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు. అప్పుడే రోడ్డు వేయడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడంతో అంబర్‌పేట ఫ్లైఓవర్ కింది భాగం పూర్తి కాలేదని వెల్లడించారు. జనగాం – దుద్దెడ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే త్వరగా రోడ్డు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఖమ్మం – విజయవాడ మద్య వెంకటాయల్లి నుండి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ తమకు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుందని చెప్పారు.