డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు… అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.
పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. ‘దేవుడు అంతా చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అందరం తోడు ఉంటాం’ అని తెలిపారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు.
జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పీఎస్ లో పోసానిపై కేసు నమోదయింది. 196, 353 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.