మల్లక్కపేట హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి చోరీ..
హుండీలోని నగదు అపహరణ..
రంగంలోకి దిగిన పరకాల పోలీసులు..
పరకాల సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి::
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించుకెళ్లినట్లు సమాచారం. శనివారం ఉదయం పూజల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకుడు, సిబ్బంది ఆలయ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా హుండీ తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పరకాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరించడంతో పాటు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలో చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. సీసీ కెమెరాల దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
