మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.. 

Warangal Bureau
1 Min Read

మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి..

కంటాత్మకూర్ చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌ల డిమాండ్..

పరకాల సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి::

నడికూడ మండల రెవెన్యూ పరిధిలోని కంటాత్మకూర్ గ్రామ శివారులో ఉన్న సాకిరేవు గుట్టలో మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కంటాత్మకూర్ సర్పంచ్ తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నడికూడ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సాకిరేవు గుట్టలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులతో కలిసి సర్పంచ్ తిరుపతి చేస్తున్న పోరాటంపై కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ, గ్రామ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన సహజ సంపదను కాపాడాల్సిన బాధ్యత తిరుపతిపై ఉందన్నారు. మైనింగ్ పేరుతో గుట్టను తవ్వితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, రైతులకు, పర్యావరణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాకిరేవు గుట్టలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వకూడదని కోరారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేసి గుట్టను పరిరక్షించాలని అధికారులను వారు కోరారు. గ్రామ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గునిపర్తి సర్పంచ్ రాధిక కర్ణాకర్, మదన్నపేట సర్పంచ్ కత్తి రమేష్, ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి, రామకృష్ణాపూర్ మాజీ సర్పంచ్ పెండ్లి రాజు, శనిగరం కొత్తపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *