ఆల్ ది బెస్ట్ ..

పదవ తరగతి విద్యార్థులకు శుభాశీస్సులు

Siddipet Bureau
2 Min Read

సిద్ధిపేట , మార్చి 13 ,(ప్రజాజ్యోతీ) : నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థినీ, విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సందేశం ఇస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులు సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన పాఠాలు ఇప్పుడు ఫలితాల రూపంలో బయటపడే సమయం వచ్చిందన్నారు. భయపడకుండా, ఏకాగ్రతతో పరీక్షలు రాస్తే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని చెప్పారు. విద్యార్థులు తమ చదువు ద్వారా చదివిన పాఠశాలకు, సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ఆశలు ఎంతో కీలకమని ఆయన తెలిపారు. వారి ఆశయాలను నెరవేర్చేలా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల ఫలితాల్లో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని తెలిపారు . సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ఆల్పాహారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందజేసి, విద్యార్థులు పరీక్షలకు మరింత సన్నద్ధం అయ్యేలా చర్యలు చేపట్టామని వివరించారు.విద్యార్థులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది అయిన పదవ తరగతి పరీక్షలను ఎంతో ముఖ్యంగా భావించి కృషి చేయాలని సూచించారు. గతంలో మంచి మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ లో ప్రవేశాలు పొంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. విద్యార్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు వారికి ఉత్తరాలు పంపించి ప్రోత్సాహం అందించానని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *