- “జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబరాలు”
- ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై రఘుపతి
ఖానాపూర్,నవంబర్ 22 (ప్రజా జ్యోతి):
జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా ఈరోజు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ జడ్.పి.హెచ్.ఎస్ ఖానాపురం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు పి.కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎస్సై రఘుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ కుమారస్వామి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా కష్టపడి చదివి శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి చేస్తూ ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొంటూ తమ నైపుణ్యాన్ని దినదినం పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యఅతిథి, స్థానిక మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.హెచ్. రఘుపతి మాట్లాడుతూ.. జన విజ్ఞాన వేదిక విద్యార్థులను భారతదేశానికి కావలసినటువంటి శాస్త్రీయ నైపుణ్యం పెంపొందిస్తూ, సమాజానికి సేవ చేసే సేవకులైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందుంటుందన్నారు. మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలు, చేతబడులు, బాణామతులను ప్రోత్సహించ కూడదన్నారు. యువత డ్రగ్స్,బెట్టింగ్స్, జూదం లాంటి దుర్వ్యసనాలకు లోనై, అమూల్యమైన జీవితాలను అంధకారం చేసుకోవద్దన్నారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ.. మంచి భావి భారత పౌరులుగా ఎదగాలంటే శాస్త్రీయ దృక్పథం తోటే సాధ్యమైతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు తమ మార్గాన్ని శాస్త్రీయత వైపు కొనసాగించాలన్నారు అప్పుడే పురోగతి సాధ్యమవుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక నిర్వహించే టాలెంట్ టెస్ట్ లో ప్రథమం ప్రథమ స్థానంలో నిలిచి ఖానాపూర్ మండలం పేరును నిలబెట్టాలన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు పెండం భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయ జ్ఞానంతో పాటు విలువలతో కూడిన జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లా జెవివి జనరల్ సెక్రెటరీ సుధాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల, మండల స్థాయిలో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో కూడా ఇలాగే ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈనెల నవంబర్ 28 తారీఖున జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖానాపూర్ మండలం చెకుముకి కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక అభిమానులు, సీనియర్ కార్యకర్తలు జెవివి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్నందుకు అందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేశారు. మండల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో జెడ్పిహెచ్ఎస్ ధర్మరావుపేట, ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో జెడ్పిహెచ్ఎస్ దబీర్ పేట,రెసిడెన్షియల్ విభాగంలో అశోక్ నగర్ సైనిక్ స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు మండల స్థాయిలో ప్రధమస్థానంలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్స్ కిష్టయ్య, రామ్మోహన్ రావు నాయుడు,ఆలూరి రాజు, శ్రీనివాస్,భాస్కర్, వీరన్న, బాలాజీ, సంధ్య తదితరులున్నారు.
