రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఓ టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా, టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
కారును ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కొంత దూరం వరకు కారును ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు. టిప్పర్ కింద చిక్కుకోవడంతో కారులోని ప్రయాణికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది