భారతీయ చిన్నారులకు అవసరం లేకపోయినా వైద్యులు యాంటీబయాటిక్స్ మందులు రాస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిన్న చిన్న అనారోగ్యాలకూ యాంటీబయాటిక్స్ మందులు వాడేలా చేస్తున్నారని తేలింది. దీనికి ప్రధాన కారణం వైద్యులపై తల్లిదండ్రుల ఒత్తిడేనని శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నా సరే తమ పిల్లలకు వెంటనే నయం కావాలని తల్లిదండ్రులు వైద్యులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని వారు పేర్కొన్నారు.
దీంతో పిల్లల అనారోగ్యానికి బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ కారణం కానప్పటికీ వైద్యులు వారికి యాంటీబయాటిక్స్ మందులు రాస్తున్నారని చెప్పారు. దీనివల్ల పిల్లలకు యాంటీబయాటిక్స్ ఓవర్ డోస్ అవుతుందని, భవిష్యత్తులో వారికి మందులకు నిరోధకత (యాంటీమైక్రోబియాల్ రెసిస్టెన్స్–ఏఎంఆర్) ఏర్పడుతుందని వివరించారు. ఈ నిరోధకత పెరగడం వల్ల అనారోగ్యాలకు చికిత్స చేయడం మరింత కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లలు విరేచనాలతో ఇబ్బంది పడడం సహజమని, దానికి సాధారణ చికిత్స సరిపోతుందని నిపుణులు తెలిపారు. అయితే, విరేచనాలు వెంటనే తగ్గాలనే తల్లిదండ్రుల ఆత్రుత కారణంగా వైద్యులు అవసరం లేకపోయినా యాంటీబయాటిక్ మందులు రాస్తున్నారని, వాటిని ఉపయోగించడం వల్ల విరోచనాలు వెంటనే తగ్గిపోతాయని చెప్పారు. తాత్కాలికంగా సత్ఫలితాన్నిచ్చే ఈ మందుల వల్ల దీర్ఘకాలంలో చేటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆ మందులు ఎక్కువగా వాడడం వల్ల పిల్లల్లో యాంటీమైక్రోబియాల్ నిరోధకత పెరిగి అనర్థాలకు దారితీస్తుందని చెప్పారు. ఈ విషయంలో వైద్యులను తప్పుపట్టేందుకు లేదని, తమ పిల్లలకు త్వరగా నయం కావాలని ఆలోచించే తల్లిదండ్రులదే తప్పని అన్నారు. యాంటీబయాటిక్ మందుల వాడకంపై అపోహలు, అవసరం లేకున్నా వాడితే కలిగే అనర్థాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.