భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. కానీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు క్రికెట్ అవసరమా? అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం, వ్యాపారాలు చేయడం సరికాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
దుబాయ్‌లో ఎల్లుండి భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న నేపథ్యంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఆయన ప్రస్తావించాడు. “ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్, వ్యాపారం వంటివి ఉండకూడదని అందరూ భావించారు. మేం కూడా లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్ ఆడలేదు” అని భజ్జీ గుర్తుచేశాడు.
అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశాడు. “వ్యక్తిగతంగా పాకిస్థాన్‌తో క్రికెట్, వ్యాపార సంబంధాలను నేను సమర్థించను. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు ఇవి ఉండకూడదనేది నా అభిప్రాయం. కానీ, మ్యాచ్ జరగాలని ప్రభుత్వం చెబితే దాన్ని తప్పక పాటించాలి” అని అన్నాడు.
ప్రస్తుత భారత జట్టుపై హర్భజన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నా జట్టు చాలా బలంగా ఉందన్నాడు. “భారత జట్టును ఓడించగల సత్తా ప్రస్తుతం మరో జట్టుకు లేదు. మన జట్టుకు మనమే సాటి. దుబాయ్‌లో ఆడటం మనకు సొంత గడ్డపై ఆడినట్లే ఉంటుంది. స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది. ఈసారి కప్ మనమే గెలుస్తామని ఆశిస్తున్నా” అని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో, వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. “ఈ రోజు పంజాబ్ విపత్తును ఎదుర్కొంటోంది. ఎంతో మంది జీవితాలు, పొలాలు దెబ్బతిన్నాయి. ప్రజలందరూ తమకు తోచిన సహాయం చేసి పంజాబ్‌కు అండగా నిలవాలి” అని హర్భజన్ కోరాడు.